విభజన హామీల గురించి వైసీపీ ఎంపీలు కనీసం ప్రస్తావించడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రత్యేకహోదా సాధిస్తామని దండోరా వేసి ఓట్లు దండుకున్నారు జగన్ అని.. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసును జగన్ ఎత్తడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. అంతేకాకుండా.. మాట తప్పం.. మడమ తిప్పం అనే జగన్ సిద్దాంతం ఏమైంది..? ప్రధాని కన్పిస్తే సెల్ఫీలు దిగి సంబరపడే జగన్.. ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదు. కేసుల భయంతో.. జైలు భయంతో ప్రత్యేక హోదా గురించి వైసీపీ అడగడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామా డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు ఎందుకు తన ఎంపీలతో రాజీనామా చేయించడం లేదు..? మూడేళ్లల్లో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థను తీసుకు రాగలిగారా..? భవనాల నిర్మాణం పూర్తి చేయగలిగారా..? విశాఖ రైల్వే జోన్ ప్రకటన వచ్చినా.. కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు.. దీనిపై జగన్ ఏమంటారు..? పోలవరం పూర్తి కాకుండా ఉండేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో.. అన్ని చర్యలు తీసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టు గురించి మాజీ మంత్రి ఏదేదో చెప్పాడు.. ఇప్పుడొచ్చిన మంత్రికి ఏమీ తెలీదు. ఢయాఫ్రమ్ వాల్ విషయం మొదలుకుని.. ప్రతి దానికీ చంద్రబాబుని తప్పు పడుతున్నారు. పోలవరం నిర్వాసితుల సంగతేంటీ..? రూ. 550 కోట్లు నిర్వాసితులకు ఖర్చు పెట్టామంటోన్న ప్రభుత్వం.. స్పష్టత ఇవ్వగలదా..? పోలవరం నిర్వాసితులను ముంచేసిన ప్రభుత్వం వైసీపీనే. 2019 తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంల డిన్నర్ పార్టీలు.. కౌగిలింతలు చూసి విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని భావించాం. కానీ ఆ డిన్నర్ పార్టీలు.. కౌగిలింతలన్నీ హైదరాబాదులో తన ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని జగన్ చెప్పకనే చెప్పారు. విభజన సమస్యలను ఎప్పుడు తీరుస్తారు..? లేదా ఎప్పుడు రాజీనామా చేస్తారో జగన్ చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గతంలో చంద్రబాబు అడ్డుకున్నారు.. కానీ ఇప్పుడు సీఎం జగనేం చేస్తున్నారు..?రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఖర్చు పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.