దుష్ట చతుష్టయం…గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు…ఇంకా చెప్పాలంటే టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు అంటున్న పేరు. ఏకంగా సీఎం జగన్ దగ్గర నుంచి కింది స్థాయి వైసీపీ నేతలు వరకు దుష్ట చతుష్టయం పేరు వాడుతున్నారు. అలాగే దుష్ట చతుష్టయం అంటే…చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5…అని కూడా వివరించి చెబుతున్నారు. తాము మంచి చేస్తున్న సరే ఈ పచ్చ మీడియా, పచ్చ పేపర్లు అబద్దాలు చెప్పి తమపై విషం చల్లుతున్నాయని జగన్ విమర్శిస్తున్నారు.
ప్రతి సభలోనూ ఈ పేరు వాడకుండా ఉండటం లేదు. తాజాగా వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.10 వేలు వేసిన జగన్…విశాఖ వేదికగా టీడీపీపై ఫైర్ అయ్యారు. దుష్ట చతుష్టయం పచ్చ టీవీలు, పచ్చపత్రికలు, దత్తపుత్రుడి అబద్దాలు, వక్రీకరణ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తనకు నిబద్ధత, నిజాయితి, దేవుడు దయ ఉందని, ప్రజల దీవెన ఉందని చెబుతున్నారు. అయితే ఇలా దుష్ట చతుష్టయం అనే పేరుని పదే పదే వాడటానికి కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అంటే చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా, ఆనుకూల పత్రికలు, పవన్ కల్యాణ్ చెప్పేవి అబద్దాలు అని, వారిని నమ్మొద్దని ప్రజలకు జగన్ పరోక్షంగా సూచిస్తున్నారు. తాము మంచి చేస్తున్న సరే ఏదో చెడు జరిగినట్లు చూపిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అందుకే పదే పదే ఆ పేరు చెబుతూ..టీడీపీ చేసే ఆరోపణలు, విమర్శలు నమ్మకుండా ప్రజలు ఉంటారనేది జగన్ కాన్సెప్ట్.
అయితే ఇది పీకే టీం వ్యూహంలో భాగంగా వచ్చిందే అని టీడీపీ, జనసేన శ్రేణులు అంటున్నాయి. ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్మేస్తారనే కాన్సెప్ట్ వైసీపీది అని అంటున్నారు. అలా చేయడం వల్ల తమపై ఉన్న నెగిటివ్ పోతుందని అనుకుంటున్నారని చెబుతున్నాయి. పైగా వైసీపీ, వైసీపీ ఆనుకూల మీడియా ఏం చేస్తుందో ప్రజలకు తెలుసని, అలాగే జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసని అంటున్నారు. మరి చూడాలి జగన్ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.