ఆగష్టు 21…ఈ తేదీ అధికార టీఆర్ఎస్ పార్టీని బాగా టెన్షన్ పెడుతుందని చెప్పొచ్చు. ఆ రోజున ఎంతమంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్తారో అనేది క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే 10-12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టించాయి. అసలు ఏ ఎమ్మెల్యే వెళ్లిపోతారనే చర్చ ఆ పార్టీలో జరుగుతుంది. ఎమ్మెల్యేలు కాకపోయినా ఏ టీఆర్ఎస్ నేత బీజేపీలో చేరతారనే టెన్షన్ మాత్రం ఉందని చెప్పొచ్చు.
ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన విషయం తెలిసిందే. మునుగోడులో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం లాంఛనమైంది.
అలాగే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలతోపాటు సినీ ప్రముఖులతో, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ సినీనటి జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. జయసుధ 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
తర్వాత ఆమె టీడీపీలో చేరడం…మళ్ళీ వైసీపీలోకి రావాలని అనుకోవడం జరిగాయి…కానీ కొంతకాలం నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో….ఆమె ఆ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరైనా ఎమ్మెల్యే బీజేపీలో చేరతారనే డౌట్ టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. 21వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి ఎవరు షాక్ ఇస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఉంటుందో లేదో 21వ తేదీ వరకు ఆగాల్సిందే.