FACT CHECK : ప్రభుత్వ సబ్సిడీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరేనా..?

-

ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు, సేవలు పొందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ నంబర్ కచ్చితంగా ఉండాల్సిందేనని ఉడాయ్ స్పష్టం చేసింది. అయితే ఆధార్ లేని వారి పరిస్థితి ఏంటని అనుకుంటున్నారా. దానికీ ఓ ఉపాయం ఆలోచించింది. ఆధార్ నంబర్ పొందని వ్యక్తికి ప్రయోజనాలు, రాయితీలు, సేవలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించాలని ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 నిబంధనలో సూచించింది.

‘చట్టంలోని సెక్షన్ 7లోని నిబంధనను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక వ్యక్తికి ఆధార్ నంబర్ కేటాయించకపోతే.. అతను/ఆమె ఎన్‌రోల్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలి. అలాంటి వ్యక్తికి ఆధార్ నంబర్ కేటాయించే వరకు, అతను/ఆమె ప్రయోజనాలు, సబ్సిడీలు, సేవలను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్(EID) నంబర్/స్లిప్‌తో పాటు ప్రత్యామ్నాయ గుర్తింపు మార్గాల ద్వారా పొందవచ్చు’ అని సర్క్యులర్ పేర్కొంది. దీనర్థం ఒక వ్యక్తికి ఇంకా ఆధార్ నంబర్ లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు, సబ్సిడీలను పొందేందుకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్ (EID) నంబర్/స్లిప్ అవసరం.

99 శాతం మంది పెద్దలకు ఆధార్‌ నంబర్‌లను కేటాయించారు. దాదాపు అందరికీ ఆధార్‌ నంబర్‌లు ఉన్నాయని అనేక సేవలు, ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందుతాయని సర్క్యులర్ పేర్కొంది. సంక్షేమ సేవలను పౌరులకు అందించడంలో నాణ్యతను ఆధార్ గణనీయంగా మెరుగుపరిచిందని వెల్లడించింది. ఉడాయ్ తాజా డేటా ప్రకారం.. 95.74 లక్షల ఆధార్ నంబర్లు పెద్దలకు కేటాయించారు. ఇది 2022 నాటికి భారతదేశంలోని వయోజన జనాభాలో దాదాపు 101 శాతం. ప్రభుత్వంలో లీకేజీలను అరికట్టడానికి ఆధార్ ప్రధాన సాధనంగా పరిగణిస్తారు.

ఉడాయ్ ఇంతకుముందు ప్రజలకు వర్చువల్ ఐడెంటిఫైయర్ అందజేసింది. ఇది సంబంధిత వ్యక్తికి భద్రత అందించే మ్యాప్ చేసిన ఇంటర్‌ ఛేంజబుల్ 16-అంకెల సంఖ్య. ఆన్‌లైన్ అథెంటికేషన్‌, లేదా e-KYC కోసం ఆధార్ నంబర్‌కి బదులుగా ఈ వీఐడీని ఉపయోగించవచ్చని నిబంధనలు పేర్కొన్నాయి. వర్చువల్ ఐడీని ఉపయోగించి ఆధార్ అథెంటికేషన్‌ చేయవచ్చని సంస్థలు నిర్ధారించుకోవాలి.

అయితే ఆగస్టు 11న జారీ చేసిన రెండో సర్క్యులర్‌లో.. ప్రభుత్వ సంస్థలు వర్చువల్‌ఐడీని ఆప్షనల్‌గా చేయొచ్చని ఉడాయ్‌ పేర్కొంది. సాంఘిక సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఆధార్ నంబర్ అవసరం కావచ్చని అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు, రాయితీలు, సేవలను అందించడానికి లబ్ధిదారుల అర్హతను నిర్ణయించడానికి ఆధార్ నంబర్ ఉపయోగపడుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news