పవన్ కల్యాణ్ పాడిన ఈ పాటల గురించి మీకు తెలుసా?

-

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మార్కెట్‌లో ఈ పేరుకున్న క్రేజే వేరు. మల్టీప్లెక్సైనా, మాస్‌ థియేటరైనా.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు, ఈయన బొమ్మ కనపడితే చాలు అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే తెరపై అంత హంగామా చేసే పవన్‌ తెర వెనక సాదాసీదాగా ఉంటారు. అయితే పవన్‌లో నటన మాత్రమే కాకుండా చాలా కళలు దాగున్నాయి. అందులో గానం ఒకటి. పవన్‌ ఇప్పటివరకు పాడిన పాటలన్నీ హిట్టే. ఈ రోజు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా పవన్ పడిన పాటలు గురించి ఓసారి తెలుసుకుందాం!

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

పవన్‌ ‘తమ్ముడు’ సినిమాలో రెండు పాటలు పాడాడు. అవి పూర్తిస్థాయి పాటలు కాకపోయినా.. ఆ సినిమా పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేస్తాయి. మల్లికార్జునరావును ఆటపట్టిస్తూ పాడే ‘తాటి చెట్టు ఎక్కలేవు’ ఎంతటి హుషారుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆదే సినిమాలో పవన్‌ పాడిన మరో బిట్‌ సాంగ్‌ ‘ఏం పిల్లా మాట్లాడవా’ అయితే అదుర్స్‌ అంతే.

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పే సినిమాల్లో ‘ఖుషీ’ ఒకటి. ఆ సినిమాలోనూ పవన్‌ ఓ పాట పాడాడు. ఏంటీ.. గుర్తొచ్చేసిందా? ఆఁ.. అదే ‘బై బయ్యే బంగారు రమణమ్మ..’. అలీ వచ్చి.. మీ నాన్న పాట.. సీకాకుళం పాట అనగా పవన్‌ అందుకుంటాడు. తాగిన మత్తులో పవన్‌ వేసే సరదా స్టెప్పులు, ఆ తర్వాత మధుమిత అలియాస్‌ భూమిక పోస్టర్‌ దగ్గర చేసే రచ్చ వేరే లెవల్‌ అంతే. ఆ సీన్‌ అంతగా హైలోకి వెళ్లిందంటే ఈ పాటదే ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు.

పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే… అతడి ఫిలాసఫీ, ఆలోచన విధానం గురించి ఎక్కడో ఓ చోట కచ్చితంగా చెబుతాడు అంటుంటారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రయత్నాలు చేశాడు పవన్‌. దర్శకుడిగా మారి ‘జానీ’ సినిమా చేశాడు. అందులో ఒక బిట్‌ సాంగ్‌, ఒక ఫుల్‌ సాంగ్‌ ఆలపించాడు. ఎమ్మెస్‌ నారాయణ తాగుడు గురించి పవన్‌ సెటైరికల్‌గా పాడే పాట ‘నువ్వు సారా తాగకు..’ పాటకు ఆ రోజుల్లో వచ్చిన రియాక్షన్‌ అదుర్స్‌ అంతే. అదే సినిమాల్లో సమాజం లోని కొంతమంది మోసగాళ్ల మీద సెటైర్లతో పాడిన పాట ‘రావోయి మా ఇంటికి’ గురించి ఎంత చెప్పినా తక్కువే.

పవన్‌ కల్యాణ్‌ అంటే.. బిట్‌ సాంగ్స్‌, సందేశం ఇచ్చే సాంగ్సేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ‘గుడుంబా శంకర్‌’ సినిమాలో పవన్‌ ఓ ఐటమ్‌ సాంగ్‌ పాడాడు. ‘కిల్లీ కిల్లీ..’ అంటూ పవన్‌ గొంతెత్తితే ఫ్యాన్స్‌ ఊగిపోయారంతే. పవన్‌ గొంతు, స్టెప్పులు కలసి పాట ఫుల్‌ జోష్‌లో ఉంటుందంతే.

వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ వచ్చిన పవన్‌.. ‘గుడుంబా శంకర్‌’ తర్వాత చాలా సినిమాల్లో పాడలేదు. మళ్లీ ‘పంజా’తో గొంతు సవరించుకున్నాడు. ఈసారి ‘పాపా రాయుడు’ అంటూ బ్రహ్మానందాన్ని పవన్‌ పొగుడుతూ తిట్టే తీరు ఉంటుందీ.. ఓ లెవల్‌ అంతే. ఫుల్‌మాస్‌ బీట్‌లో సాగే ఈ పాట చాలా రోజులు రిపీట్‌ మోడ్‌లో వినేసి సంతోషించారు అభిమానులు.

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోనూ పవన్‌ గానం వినిపిస్తుంది. ‘కాటమ రాయుడా కదిరి నరసింహుడా’ అంటూ పవన్‌ మళ్లీ బ్రహ్మానందం భరతం పట్టేలా ఆ పాటను రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌, పవన్‌ గొంతు పాటకు ఓ డిఫరెంట్‌ స్టైల్‌ని ఇచ్చాయి.

సహచర నటుణ్ని ఆటపట్టించే పాటలు పాడటం అంటే.. పవన్‌ కల్యాణ్‌కు కొట్టినపిండి అనే విషయం తెలిసిందే. ఆయన పాడిన పాటలు చాలావరకు అలానే ఉంటాయి. ఇదే కోవలో ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్‌ ఓ పాట పాడాడు. ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ పవన్‌ గొంతెత్తితే.. యూట్యూబ్‌లో వ్యూస్‌ రికార్డులు మారిపోయాయి. ఇక థియేటర్లలో ఫ్యాన్స్‌ జోష్‌ అయితే అదిరిపోయింది.

పవన్‌ నటనతోనే కాదు, గొంతుతోనూ మాయ చేయగలడు అని ఈ తొమ్మది పాటలు చెప్పకనే చెబుతాయి. అందుకే పవన్‌ నటుడిగానే కాకుండా.. ‘పాటగాడి’గానూ ఫ్యాన్స్‌కు బాగా ఇష్టం.

Read more RELATED
Recommended to you

Latest news