ఈ జనరేషన్ పిల్లలు పొద్దున లేచినప్పటి నుంచి ఫోన్ లోనే మునిగితేలుతుంటారు. చిన్నపిల్లలు కూడా 24 గంటలు ఫోన్లలోనే బిజీ అవుతున్నారు. గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తుంటారు. అయితే ఈ గేమింగ్ కి ఎంతగా బానిసలవుతున్నారంటే.. గేమ్ లో ఓడిపోయినా.. తల్లిదండ్రులు ఆడనివ్వకపోయినా ఆత్మహత్యలకు పాల్పడే అంత పిచ్చిగా మారిపోతున్నారు. ఇక ఫోన్ లో గేమ్ ఆడుతున్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. అలా గేమ్ ఆడుతున్న ఓ బాలుడు తనను పాము కాటు వేసింది కూడా గమనించలేదు. అలాగే గేమ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని ఇందోర్ చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఇటుక బట్టీలో పని చేస్తోంది. వారి పిల్లాడు ఫోన్లో ఆన్లైన్ గేమ్లకు బానిసయ్యాడు. పెద్దవారు పనిచేస్తున్న సమయంలో ఒళ్లు తెలియకుండా ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. అయినా అతడు గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆ బాలుడిని గుర్తించిన ఇసుక బట్టీ యజమాని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూనే ఆ బాలుడు మృతి చెందాడు.