పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం జరగనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణకు తాను హాజరుకావడం లేదని చెప్పారు. తనను ఆహ్వానించిన తీరు నచ్చకపోవడమే అందుకు కారణమని వెల్లడించారు.
‘నిన్న నాకు ఒక జూనియర్ స్థాయి అధికారి నుంచి లేఖ వచ్చింది. ‘ప్రధాని గురువారం సాయంత్రం ఏడు గంటలకు నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మీరు ఆరు కల్లా అక్కడుండాలి’ అని దానిలో పేర్కొన్నారు. నేనేమైనా వారి సేవకురాలినా..? ఒక ముఖ్యమంత్రిని జూనియర్ స్థాయి అధికారి ఎలా ఆహ్వానిస్తారు. సాంస్కృతిక శాఖ మంత్రి ఎందుకు అంత ఎత్తుమీద ఉన్నారు? అందుకే నేతాజీపై ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడి విగ్రహానికి పూలదండ వేసి, నివాళి సమర్పించాను ’ అని ఆమె వెల్లడించారు.