అంబేద్కర్, నానీ ఫాల్కీ వాలాలే నా హీరోలు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ పార్టీనేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆరుతో నన్ను నేను పోల్చుకోలేనని.. అందుకే తొమ్మిది నెలల్లో అధికారం సాధిస్తామనే మాటలు నేను చెప్పనన్నారు.
టీడీపీ స్థాపించిన నాటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు అని తెలిపారు. 2009లో మార్పు వస్తుందని నేను చాలా ఆశించాను.. కానీ అది జరగలేదని వెల్లడించారు. ఇది నన్ను వ్యక్తిగతంగా చాలా బాధించిందని… అప్పటి నుంచి నా ఆలోచనా విధానం మారిందని తెలిపారు.
మార్పు జరిగేంత వరకు పోరాడాలని.. చివరి శ్వాస వరకు నిలబడి ఉండాలని నిర్ణయించుకున్నా… అణగారిన కులాలకు అధికారాన్ని దగ్గర చేయాలని 2009లో నేను చేసుకున్న సంకల్పమే నన్ను ఇప్పటికీ నడిపిస్తోందన్నారు. 2019లో ఓటమి పాలైనప్పుడు నేను పారిపోతానని చాలా మంది ఆశించారు…కానీ నేను ధైర్యంగా నిలబడ్డాను.. మార్పు కోసమే నేను నిలబడాలని సంకల్పించుకున్నానని వెల్లడించారు. నా పార్టీని.. నా నేలను.. నా దేశాన్ని వదిలేదే లేదని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్.