రేవంత్ ఎత్తులు..కాంగ్రెస్‌కు ప్లస్..!

-

తెలంగాణలో కాంగ్రెస్ రేసులో వెనుకబడిపోయినట్లే కనిపిస్తోంది…కానీ టీఆర్ఎస్-బీజేపీ పోరులో మాత్రమే కాంగ్రెస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది గాని..ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ వెనుకబడలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో వాస్తవ పరిస్తితులు చూసుకుంటే టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ బలంగా ఉంది..బీజేపీ మూడో స్థానలోనే కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో బలం ఉంది. ఆ బలం టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.

అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా రేవంత్ రెడ్డి వదులుకోవడం లేదు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి..ప్రధానంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ యాత్ర ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ బలం ఇంకా పెంచాలని చూస్తున్నారు. అందుకే యాత్రని సక్సెస్ చేసేందుకు రేవంత్ తనదైన శైలిలో ఎత్తులు వేసుకుంటూ ముందుకెళుతున్నారు.

ఓ వైపు మునుగోడు ఉపఎన్నికపై దృష్టి పెడుతూనే..మరోవైపు రాహుల్ యాత్రని ఊహించని విధంగా సక్సెస్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రాహుల్ యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఏపీలో యాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. దాదాపు 14 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగనుంది. ఈ 14 రోజుల పాటు యాత్రని సూపర్ సక్సెస్ చేసి..తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ పనిచేయనున్నారు.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన మీడియాగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావుని సైతం కలిసి..రాహుల్ యాత్రకు కవరేజ్ ఇవ్వమని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలకు మీడియా మద్ధతు ఎక్కువ. కాంగ్రెస్‌కు మీడియా మద్ధతు లేదు. కానీ రేవంత్ తనకున్న సత్సంబంధాలతో ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి సంస్థల మద్ధతు పొందారు. ప్రధానంగా ఈనాడుతోనే ప్లస్ ఉంటుంది. అందుకే రేవంత్, రామోజీని కలిశారు. మొత్తానికి రాహుల యాత్ర, ఈనాడు సపోర్ట్ తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news