తాడేపల్లికి ‘నగరి’ లొల్లి.. జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు

-

ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో నేతలు వర్గాలుగా విడిపోయారు. నగరి పంచాయితీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది.

నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై మంత్రి రోజా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి వర్గం వ్యవహారంపై రోజా తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలోనే పలుమార్లు ఆరోపించిన రోజా.. చక్రపాణిరెడ్డి, అసమ్మతి వర్గం తీరుపై సీఎంకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల తర్వాత నియోజకవర్గంలోని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కేజే శాంతి, నగరి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కేజే కుమార్‌, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజును మంత్రి ఆర్కే రోజా దూరం పెట్టారు. వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ తరఫున కార్యక్రమాలను రెండు వర్గాలు విడిగా చేస్తున్నారు. కొందరు నాయకులు పెద్దిరెడ్డి అండతో పదవులు పొందడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది.

ఇటీవల నిండ్ర మండలం కొప్పేడులో మంత్రి రోజాతో సంబంధం లేకుండా ఆమె వ్యతిరేకవర్గం నాయకులు ఆర్బీకే, వెల్‌నెస్‌ కేంద్రానికి భూమిపూజ చేశారు. దీనిపై ఆవేదన చెందుతూ రోజా.. పార్టీ నాయకులకు విడుదల చేసిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇవాళ సీఎం జగన్‌ను కలిసి రోజా ఫిర్యాదు చేయడంతో నగరి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. రోజా ఫిర్యాదుపై సీఎం జగన్‌ ఎలా స్పందిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news