మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపుడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. అయితే ఈ నేపథ్యంలోనే నేడు సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో యుద్ధం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. ఢిల్లీ నుంచి దొంగతనంగా వచ్చి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి జైలుపాలయ్యారని అన్నారు సీఎం కేసీఆర్.
“ఓ తలకు మాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు, ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీనిపై ఇంతకుమించి మాట్లాడలేను. నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. నేను మాట్లాడితే దీన్ని ప్రభావితం చేశానని అంటారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.