మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేస్తోందని ప్రధాన పార్టీల నేతలు అంటున్నారు. అయితే.. తాజాగా నేడు మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఈ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు. దీనిపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలని చెప్పుకుంటున్న కేసీఆర్ వారు ఏపార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారో చెప్పాలన్నారు కిషన్‌రెడ్డి.
పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరేనని కిషన్‌రెడ్డి చురకలంటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇష్టానుసారంగా కొనుగోలు చేసిన కేసీఆర్‌కు బీజేపీని విమర్శించేస్థాయి లేదన్నారు కిషన్‌రెడ్డి. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం నిజమే అయితే ఫామ్ హౌజ్ లో పట్టుకున్న డబ్బులు ఎక్కడున్నాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు కిషన్‌రెడ్డి. ఇచ్చిన హామీలు మరిచిపోయిన కేసీఆర్ గెలిపిస్తే అభివృద్ది చేస్తామంటూ గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు కిషన్‌రెడ్డి.