రేవంత్‌కు కవిత సపోర్ట్..నిర్మలాకు కౌంటర్.. బీజేపీపై దూకుడుగా..!

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా పార్లమెంట్‌లో రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోవడంపై రేవంత్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూపాయి విలువ పడిపోయి ఐ‌సి‌యూలో ఉందని మోదీ కామెంట్ చేశారని, ఇప్పుడు అదే మోదీ పాలనలో రూపాయి విలువ మార్చురీకి చేరిందని అన్నారు.

ఇక దీనిపై నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ.. తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీ రేవంత్‌రెడ్డి పేలవమైన హిందీలో మాట్లాడారని, అందుకు తాను కూడా పేలవమైన హిందీలోనే జవాబు ఇస్తున్నానని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత తన రూపాయి విలువపై సమాధానం ఇచ్చారు. ఇక దీనికి రేవంత్ కౌంటర్ ఇస్తూ.. ఆర్థిక శాఖ మంత్రి తన భాష బాగాలేదని కామెంట్‌ చేశారని, తాను శూద్రుడిని కాబట్టి తనకు స్వచ్ఛమైన హిందీ రాదని,  ఆమె బ్రాహ్మణవాది కాబట్టి స్వచ్ఛమైన హిందీ వస్తుందేమో… అదేమీ తనకు సమస్య కాదని రేవంత్‌ బదులిచ్చారు. దీంతో తనది కూడా పేలవమైన హిందీయేనని నిర్మల చెప్పుకొచ్చారు. కానీ అక్కడకి ఎగతాళి చేసేసి..తర్వాత నిర్మలా కవర్ చేసుకున్నారు.

ఇలా తెలంగాణ నేతకు సంబంధించి హిందీ బాషని ఎగతాళి చేయడంపై కవిత స్పందిస్తూ.. నిర్మల సీతారామన్ వీక్ భాష కంటే.. వీక్ రూపాయి మీద మాట్లాడితే బాగుండేదని, హిందీ వస్తేనే రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. అలా పరోక్షంగా రేవంత్‌కు సపోర్ట్‌గా బీజేపీపై ఫైర్ అయ్యారు.

అలాగే బండి సంజయ్ తన మీద మాట్లాడిన మాటలు బాధించాయని, ప్రధాని మోదీ నుంచి బండి సంజయ్ వరకు అందరు మహిళల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. మొత్తానికి సి‌బి‌ఐ విచారణ తర్వాత కవిత..బీజేపీ టార్గెట్ గా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news