ఎడిట్ నోట్: లోకేష్‌తో యష్..కథ పెద్దదేనా!

-

ఏపీ రాజకీయాల్లో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల పవన్‌తో చంద్రబాబు భేటీ అవ్వడం పెద్ద సంచలనంగా మారితే..ఆ తర్వాత మోదీతో పవన్ భేటీ అయ్యారు. ఇటు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మోదీని జగన్ కలిశారు..బాబు కూడా కలిశారు. ఇలా ఊహించని అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మరో సంచలన భేటీ జరిగింది. నారా లోకేష్‌తో కే‌జి‌ఎఫ్ హీరో యష్ భేటీ అయ్యారు.

 

వీరు ఎందుకు భేటీ అయ్యారు..అసలు ముందేమీ వారి మధ్య సన్నిహిత సంబంధాలు లేవు కదా..అలాంటిది ఇప్పుడు వారు కలవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎందుకు కలిశారు.? వారు కలవడం వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అని ఊహాజనిత కథనాలు వచ్చేస్తున్నాయి. మామూలుగా వారి మధ్య ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉంటే అది వేరే విషయం. కానీ ముందు ఎప్పుడు వారికి పెద్దగా పరిచయం లేదు. పోనీ బాలయ్య-ఎన్టీఆర్ కలిశారంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్నేహితులు అని చెప్పుకోవచ్చు.

మరి లోకేష్‌తోనే యష్ ఎందుకు కలిశారు..పోనీ ఆ భేటీలో బాలయ్య కూడా లేరు. కేవలం వారిద్దరే ఏకాంతంగా అరగంట సేపు మాట్లాడుకున్నారట. మరి ఏం మాట్లాడుకున్నారు? అనేది తెలియదు. వారిద్దరిలో ఎవరోకరు చెబితేనే గాని ఏదైనా తెలుస్తోంది. కాకపోతే లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టనున్న నేపథ్యంలో యష్‌ని కలిశారని, యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న యష్‌ మద్ధతు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

కర్నాటకకు చెందిన యష్‌కు తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. పైగా ఆయన పూర్తి పేరు వినయ్ కుమార్ గౌడ్..దీంతో ఏపీలో గౌడ సామాజికవర్గం..యష్‌ని తమ హీరోగా ఓన్ చేసుకుంటున్నారు. ఇక యష్ మద్ధతు వల్ల గౌడ వర్గం ఓట్లతో పాటు యూత్ ఓట్లు కలిసొస్తాయని లోకేష్ భావించి కలిశారా? అనేది క్లారిటీ లేదు. కానీ వారిద్దరి భేటీ మాత్రం సంచలనంగా మారింది. మరి లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా యష్ మద్ధతుగా నిలబడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news