అలర్ట్‌.. రాష్ట్రాలకు కోవిడ్‌ నిబంధనలు జారీ చేసిన కేంద్రం

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. అయితే.. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కొవిడ్​ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడం సహా కొవిడ్‌ టెస్టులు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని స్పష్టం చేసింది. మరోవైపు, అన్నిరాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయ వర్చువల్​గా భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్ఠిగా కొవిడ్​ను ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Use masks, avoid international travel: IMA issues advisory to avoid  impending COVID outbreak

పలు దేశాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోన్న వేళ.. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌తోపాటు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. వైరస్‌ మరోసారి వ్యాప్తి చెందకుండా కొవిడ్‌ నిబంధనలు అమలు చేయడం సహా గట్టి నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. పండగలు, కొత్త సంవత్సరం వేడుకల వేళ.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

 

కొవిడ్‌ నిబంధనలకు సంబంధించి కింద పేర్కొన్న కీలక సూచనలను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పకుండా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

కొవిడ్‌ కట్టడికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ ధోరణి అంచనా వేసేందుకు గాను ఇన్‌ఫ్లూయెంజాతోపాటు తీవ్ర శ్వాసకోశ సంబంధ కేసులను జిల్లాల వారీగా నమోదు చేయాలి. వాటిపై పర్యవేక్షణ కొనసాగించడంతోపాటు క్రమం తప్పకుండా ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో వాటిని నమోదు చేయాలి. కొవిడ్‌ నిర్ధారణ కేసులనూ పొందుపరచాలి.
కొవిడ్‌ పరీక్షలకు అవసరమైన ఆర్టీ-పీసీఆర్‌, యాంటీజెన్‌ టెస్టు పరికరాలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఏదైనా కొత్త వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించేందుకు వీలుగా.. కొవిడ్‌ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.ఒకవేళ కేసుల సంఖ్య భారీగా పెరిగితే.. అందుకు అవసరమైన ఆస్పత్రుల సామర్థ్యం, ఆరోగ్య కార్యకర్తలు ఏ మేరకు అవసరమనే విషయాలను ముందుగానే అంచనా వేసుకొని సిద్ధంగా ఉండాలి. వీటిని పరీక్షించేందుకు ఆసుపత్రుల్లో ముందస్తు పరిశీలన చేసుకోవాలి. టీకాలపై ప్రజల్లో అవగాహన పెంచి వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి. ముఖ్యంగా ప్రికాషన్‌ డోసు మరింత వేగంగా పంపిణీ చేయడంపై దృష్టి పెట్టాలి. రాబోయే పండగలు, వేడుకల నేపథ్యంలో భారీసంఖ్యలో జనాలు గుమిగూడే సందర్భాల్లో కొవిడ్‌ కట్టడికి సంబంధించి ఈవెంటు ఆర్గనైజర్లు, వ్యాపారస్థులు, మార్కెట్‌ అసోసియేషన్‌లకు ముందుగా తగు సూచనలు చేయాలి. జన సమూసం ఏర్పడే ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించడంతోపాటు కరోనా నిర్వహణలో ప్రజల మద్దతు పొందేందుకుగాను వారిలో అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news