రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి నిజాం వాళ్లకు అమ్మేశారని అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అనలేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. కొన ఊపిరితో ఉన్న టీడీపీని బతికించుకునేందుకు ఆయన ఆరాటపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని, ఆర్బీకేలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని చెప్పారు మంత్రి బొత్స. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు సదస్సులో జగన్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలుసు అన్నారని.. వ్యవసాయం దండగ అని.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు వ్యవసాయం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారని.. నీతి ఆయోగ్ దేశమంతా ఆర్బీకేలు పెట్టాలని పరిశీలిస్తుంటే చంద్రబాబు మాత్రం వృధా అని చెప్పడాన్ని ప్రజలు గమనించాలన్నారు.