కేసీఆర్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలే మొదటగా కోరుకుంటున్నారు : జగదీష్‌రెడ్డి

-

ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలే మొట్ట మొదటగా కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్ల సమయం చాలని దేశ ప్రజలకు నిరూపించిన నాయకుడు కేసీఆర్ అంటూ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ వెలుగులు కర్ణాటక, మహారాష్ట్రను దాటి గుజరాత్ ను కూడా తాకాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ కు వస్తున్న మంచి పేరు సహించలేకే ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే రాష్ట్రానికి మోడీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

 

25 ఏళ్ల డబుల్ ఇంజిన్ పాలనలో గుజరాత్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలు అదానీ, అంబానీల కోసమే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆరోపించారు. కేసీఆర్ కు ఉన్న జన బలం కింద మోడీ ఒక లెక్క కాదంటూ మాట్లాడారు. ఈడీ, ఐటీలకు కేసీఆర్ జపం తప్పా ఇంకో పని లేదన్నారు. ఖమ్మంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో దేశ వ్యాప్తంగా కేసీఆర్ పై చర్చ జరుగుతుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం సభను విజయవంతం చేసి, కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపర్చాలంటూ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news