నేడ ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెంలో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ఆనుకొని 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అటెండ్ అవుతుండడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. వివిధ జిల్లాల నుంచి 5 వేల మంది పోలీసులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 448 ఎకరాల్లో 20 బ్లాకులుగా విభజించి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
బీఆర్ఎస్కు చెందిన 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరుకానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వారం రోజులుగా ఖమ్మంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, సత్యవతిరాథోడ్ తో పాటు పలువురు నేతలు సభావేదికను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే.. యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం సీఎంలు, మాజీ సీఎం అఖిలేష్,డి రాజా చేరుకోనున్నారు. అనంతరం ఒంటి గంటకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. లంచ్ అనంతరం 2.25 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభిస్తారు. 2.30 గంటలకు వెంకటాయపాలెం సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రులు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంగించనున్నారు. సభా అనంతరం అక్కడి నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు విజయవాడకు వెళ్ళనున్నారు. తిరిగి హెలిక్యాప్టర్లో బేగంపేటకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు.