తొలి టీ20లో దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ రెండో టీ20లో చతికిలపడింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. లక్నోలో జరుగుతున్న ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 99 పరుగులే చేసింది. లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆరంభం నుంచి ఎదురుదెబ్బలే తగిలాయి.
భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 3.3 ఓవర్ల వద్ద తొలి వికెట్ ఫిన్ అలెన్ ( 11) ను కోల్పోయిన కివీస్.. ఆ వెంటనే డేవన్ కాన్వే (11)ను వికెట్ కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (5), డారిల్ మిచెల్ (8), మార్క్ చాప్‌మన్ (14), బ్రాస్‌వెల్ (14), సోధీ (1), ఫెర్గూసన్ (0) కూడా భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్దే ఆగిపోయారు.