ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బీజేడీ సీనియర్ నేత, ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిశోర్ దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై జరిపిన కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ఛాతీలో రెండు బుల్లెట్లు ఉండడంతో చికిత్స కష్టమైంది. పరిస్థితి విషమించడంతో మంత్రి నబకిశోర్ దాస్ కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో ఈ ఘటన జరగ్గా, బుల్లెట్ గాయాలకు గురైన మంత్రి ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
అటు, కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు క్రైమ్ బ్రాంచ్ ను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. మరో పక్క భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని మంత్రి మద్దతుదారులు స్థానికంగా ఆందోళనకు దిగారు. కావాలని చేసిన కుట్రేనని ఆరోపిస్తున్నారు. కాగా మంత్రిపై కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.