హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. నిన్న 12వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర హన్మకొండలో జరిగింది. అయితే.. మంగళవారం పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న తన పాదయాత్రకు వచ్చిన యూత్ లీడర్ పవన్ పై దాడి చేయడం హేయమైన చర్య అని, వినయ్ భాస్కర్ మనుషులు ఆయనను చంపాలని చూశారని ఆరోపించారు. వరంగల్‌లో దాడులు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. చైతన్య వంతమైన ఈ గడ్డపైన ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు. వినర్ భాస్కర్ అనుచరులు గంజాయి మత్తు లో దాడి చేశారని, కమిషనర్ కూడా రాజకీయ ఒత్తిళ్లతో సరిగా పనిచేయలోకపోతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ యూత్ లీడర్ పవన్‌ను ఎమ్మెల్యే వినయ్ భాస్కరే చంపాలని అనుచరులకు ఆదేశించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడులు చేసింది ఎవరో తెలిసినా ఇప్పటి వరకూ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. దాడి దృశ్యాలు చిత్రీకరించి తమ వాళ్లకు పంపి బెదిస్తున్నారని, దాడిపై వరంగల్ సీపీని కలుస్తానని చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఇక్కడికి రావాలన్నారు. ఈ ఘటనకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిచ్చారు.