రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కు అత్యున్నత పురస్కారం దక్కింది. ప్రముఖ ఇంటర్నేషనల్ రీసెర్చి జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఆయనకు 2023 సంవత్సరానికి గానూ ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించింది. కష్టకాలంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలకు గానూ ఈ అవార్డు ఇచ్చినట్లు సెంట్రల్ బ్యాంకింగ్ తెలిపింది.
నాన్ బ్యాంకింగ్ సంస్థ కుప్పకూలినప్పుడు, కొవిడ్-19 ఒకటి, రెండు వేవ్‌లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్న ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను అధిగమించే విషయంలో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ సమర్థంగా నిర్వహించారని సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాడింది. ఆయన నాయకత్వంలోనే కఠిన సంస్కరణలు తీసుకురావడంతో పాటు, వినూత్న పేమెంట్ వ్యవస్థలు భారత్‌లో పరిచయం అయ్యాయని పేర్కొంది. కరోనా సమయంలో వృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలను కొనియాడింది. ఈ పురస్కారం అందుకున్న రెండో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నిలిచారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు 2015లో ఈ పురస్కారం లభించింది.