తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇటీవల సీనియర్ల మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడుప్పుడే ఆ పోరు తగ్గుతుంది. అయితే స్థానిక నాయకత్వాల మధ్య సీటు కోసం పోరు ఎక్కువ ఉంది. ఈ మధ్య వరంగల్ లో జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిల మధ్య రచ్చ నడిచిన విషయం తెలిసిందే.
ఇలా ఎక్కడ పడితే అక్కడ సీట్ల విషయంలో పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి పట్టున పినపాక స్థానంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క వారసుడు సూర్య వల్ల రచ్చ నడుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేగా కాంతరావు గెలిచారు. కానీ ఆయన నెక్స్ట్ బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. అక్కడ రేగాకు సొంత పోరు ఎక్కువ ఉంది. అలాగే ఆయనపై వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ ఆయన గెలవరని సర్వేల్లో తేలింది.
ఇదే సమయంలో పినపాకలో కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు మంచి ఛాన్స్ ఉంది. ఇలాంటి సందర్భంలో సీతక్క తనయుడు సూర్య పినపాకలో ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ మొదలైంది. కొంతకాలం నుంచి సూర్య పినపాకలో తిరుగుతున్నారు. అలాగే కాంగ్రెస్ క్యాడర్ ని కలుపుకోవడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో పినపాక సీటు తనదే అని సూర్య చెప్పుకుంటున్నారు. దీంతో పినపాకలో ఉన్న స్థానిక నాయకులు భగ్గుమంటున్నారు. వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ సూర్య పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వలస వచ్చిన వారికి పినపాక సీటు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక నాయకులు అంటున్నారు. మరి ఈ సీటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.