పదో తరగతి పేపర్ లీకేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో..తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి హన్మకొండ జిల్లా కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే.. ఈ నేపథ్యంలో జైళ్లో ఉన్న బండి సంజయ్ తెలంగాణ బీజేపీ శ్రేణులకు కీలక సందేశం పంపించారు. ‘‘నా ప్రియమైన కార్యకర్తలారా… భరతమాత ముద్దు బిడ్డల్లారా.. మీ అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బీజేపీ స్థాపించి నేటికి 43 ఏళ్లయింది. నాలుగు దశాబ్దాల కాలంలో బీజేపీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. పార్టీ కోసం ఎంతోమంది తమ జీవితాలనే త్యాగం చేశారు. మరెందరో తమ ప్రాణాలను అర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొదలు వాజ్‌పేయి వరకు ఎంతోమంది మహా నేతలు తమ సర్వస్వాన్ని పార్టీ కోసం ధారపోశారు. మన రాష్ట్రంలో డీఎన్ రెడ్డి మొదలు చలపతి రావు, రామారావు, టైగర్ నరేంద్ర లాంటి ఎంతోమంది జీవిత కాలమంతా పార్టీ కోసం పనిచేశారు. జితేందర్ రెడ్డి వాళ్లు నక్సలైట్లకు ఎదురొడ్డి పార్టీ కోసం పనిచేస్తూ తూటాలకు బలయ్యారు.
ఎంతోమంది నేతలను ఏళ్ల తరబడి జైళ్లో పెట్టినా అదరలేదు. బెదరలేదు. సిద్దాంతం కోసం, ప్రజల కోసం పోరాడారు. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా బీజేపీకి అధికారం ఒక్కటే లక్ష్యం కాదు.. మహోన్నతమైన భారతీయ సమాజం నిర్మాణమే అంతిమ లక్ష్యం. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పినట్లుగా ఆ లక్ష్య సాధన కోసం జీవిత కాలం పట్టినా పరవాలేదు.. చివరకు ప్రాణం పోయినా పరవాలేదు.. వచ్చే జన్మలోనూ ఆ లక్ష్య సాధన కోసమే పనిచేద్దాం. ఈ క్రమంలో గిట్టని పార్టీలు, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనమీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడతాయి. నాపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తి చూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగుల కుటుంబాల పక్షాన గళమెత్తుతూ అలుపెరగకుండా బీజేపీ చేస్తున్న ఉద్యమాలను నిలువరించేందుకు, కార్యకర్తలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రభుత్వం నాపై టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసు మోపి జైలుకు పంపింది.
నాకు కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్తకాదు. ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా. నా బాధంతా నిరుద్యోగుల భవిష్యత్ పైనే. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తమ కుటుంబ సభ్యులకు, పార్టీ నేతల అనుచరులకు, వందమాగధులకు ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలే రాకుండా చేస్తోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా? ఇక మాకు ఉద్యోగాలు రావా? అనే నిరాశ, నిస్ర్పహల్లో నిరుద్యోగ యువత ఉంది. నాడు తమ స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బలి తీసుకుంది. ఈనాడు టెన్త్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నాడు తెలంగాణ యువత బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్ సాక్షిగా కొట్లాడింది బీజేపీయే.. నేడు నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తోంది బీజేపీయే.
ఈ సమయంలో కేసీఆర్ కుట్రలకు భయపడి వెనుకంజ వేయొద్దు. ఈ విషయంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోడీనే మనకు స్ఫూర్తి. గోద్రా అల్లర్ల ఘటనలో మోడీని దోషిగా చూపితే బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కుహాన శక్తులు సాగించిన మారణ హోమాన్ని, మీడియా ద్వారా విష ప్రచారాన్ని సాగించిన విషయాన్ని మనం మర్చిపోలేం. అయినా మోడీ వెనుకంజ వేయలేదు. కార్యకర్తల మద్దతుతో ప్రజల్లోకి వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. కుహానా శక్తుల చెంప చెళ్లుమన్పించారు. అంతటి మహానేత ఈనెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడం బాధగా ఉంది. మీరంతా మోడీ సభకు హాజరు కావడంతోపాటు నిరుద్యోగ యువతను సభకు తరలించి దిగ్విజయవంతం చేయాలని కోరుతున్నారు.