పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ దగ్గర గతేడాది సెప్టెంబర్ నుంచి మొత్తం పది బిల్లులు పెండింగ్ లో ఉండగా.. మూడింటికి ఇటీవల ఆమోదం లభించింది. మరో రెండు రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లాయి. ఇప్పుడు రెండింటి పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరగా ఒకదాన్ని తిరస్కరించారు. డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
అయితే పెండింగ్ బిల్లుల ఆమోదంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బిల్లులను అకస్మాత్తుగా ప్రభుత్వానికి తిప్పి పంపించారు గవర్నర్. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 167 ప్రకారం సీఎం కేసీఆర్ తనతో చర్చించాల్సి ఉంటుందని.. ప్రభుత్వం చేపట్టే బిల్లులపై సమావేశం కావడం తప్పనిసరి అని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ గత రెండేళ్లుగా తనను సంప్రదించలేదని వెల్లడించారు.