రాజకీయాల్లో ప్రతిపక్షాలని పోలీసుల ద్వారా అడ్డుకోవడం అధికార పార్టీలు ఎప్పుడు చేసే పనే. అటు ఏపీలో వైసీపీ..అక్కడ టిడిపి నేతలని పోలీసుల చేత ఎన్ని రకాలుగా అణిచివేసే కార్యక్రమం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇటు తెలంగాణలో కూడా అధికార బిఆర్‌ఎస్..ప్రతిపక్ష కాంగ్రెస్, బిజేపిలకు పోలీసుల ద్వారా చెక్ పెడుతుంది. ఎవరు అవుననుకున్న..కాదు అనుకున్న అధికార పార్టీలకు అనుకూలంగానే పోలీసులు ఉంటారనే సంగతి తెలిసిందే.
అయితే తాజాగా తెలంగాణలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. నిరుద్యోగుల కోసం దీక్షకు వెళ్లడానికి రెడీ అవుతున్న షర్మిలని పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో తనని పట్టుకున్న మహిళా కానిస్టేబుళ్లని షర్మిల తోసేశారు. ఈ క్రమంలోనే ఆమెని కారులో ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఓ ఎస్ఐ కారు తాళం చెవి తీసుకున్నాడు. దీంతో ఆ ఎస్సైని షర్మిల చెంప దెబ్బ కొట్టారు. రోడ్డుపై బైఠాయించిన షర్మిలాను పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు.
ఇక షర్మిల అరెస్ట్ కావడంతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ..జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అక్కడ విజయమ్మ మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. ఈ అంశంపై షర్మిల మాట్లాడుతూ “నేను ధర్నాకు పోలేదు. ముట్టడి అని పిలుపు నివ్వలేదు. నన్ను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..? నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా? నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా..? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత” అని చెప్పుకొచ్చారు. మొత్తానికి షర్మిల, విజయమ్మ పోలీసులపై చేయి చేసుకోవడంపై సంచలమైంది.