టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తొలగిస్తారు..సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తారు..పథకాలు రద్దు చేస్తారు..ఇది గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న ప్రచారం. అంటే అలా చెప్పి టిడిపికి నెగిటివ్ చేయాలని లక్ష్యంతో వైసీపీ ముందుకెళుతుంది. అలాగే టిడిపి-జనసేన మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం నడిపిస్తుంది. కానీ వీటి అన్నిటికి టిడిపి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే లోకేష్..వాలంటీర్, సచివాలయ వ్యవస్థలపై క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే జగన్ అమలు చేసే పథకాలకు రెట్టింపుగా పథకాలు అమలు చేస్తామని టిడిపి హామీ ఇచ్చింది..అలాగే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలని కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదని, వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు. ఆ వ్యవస్థలని కొనసాగిస్తామని చెప్పారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్న వైసీపీని దెబ్బకొట్టే విధంగా లోకేష్..గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ ప్రజలని ఆకట్టుకునేలా ముందుకెళుతున్నారు. టిడిపి బలం పెరిగేలా చేస్తున్నారు.
అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయితీలు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న విషయం తెలిసిందే. ఇక పంచాయితీ నిధులని వేరే వాటికి తరలిస్తున్నారు. దీనిపై సర్పంచ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సర్పంచ్లకు లోకేష్ హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసాను ఎక్కడా దారి మళ్లించకుండా పంచాయతీలకే జమ చేస్తామని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, నిధులు ఇవ్వడమే కాకుండా సర్పంచుల గౌరవాన్ని, గౌరవ వేతనాన్ని పెంచుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇలా లోకేష్ రూరల్ ప్రాంతాల్లో కీలక హామీలు ఇచ్చి టిడిపికి మైలేజ్ పెంచే కార్యక్రమం చేపట్టారు.