తుమ్ములు రావడం మనకు పెద్ద ఇబ్బంది కాదు.. జలుబు చేసినప్పుడు అయితే ఒకేసారి నాలుగు ఐదు తుమ్ములు వస్తాయి.. బాగా ఎక్కువ సార్లు తుమ్మితే తలనొప్పి రావడం సహజం.. కానీ ఓ యువకుడి తుమ్మినందుకు ఆసుపత్రికి వెళ్లాడు.. కేవలం తుమ్మడం వల్ల అతనికి ముక్కు నుండి రక్తం కారింది, ఆ రక్తం కూడా గడ్డ కట్టింది. అతడు స్పృహ కోల్పోయాడు. కాస్త స్పృహ వచ్చాక చూస్తే దృష్టి సరిగ్గా లేదు..ఒళ్లంతా వణుకుతున్నట్టు అయింది. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేవలం తుమ్మడం వల్ల ఆసుపత్రికి రావడం అక్కడ వైద్యులకు కూడా ఆశ్చర్యం కలిగించింది. వైద్యులు అతనికి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం స్కానింగ్‌లు, పరీక్షలు చేశారు.అతనికి చాలా అరుదైన వ్యాధి ఉన్నట్టు తేల్చారు. ఆ యువకుడి పేరు సామ్ మెస్సిన్. నివసించేది అమెరికాలో.’
ఏం జరిగిందంటే..
వైద్యులు అతనికి అత్యవసర చికిత్స చేసి కాపాడారు. మెదడులోని ధమనులు, సిరలను కలిపే రక్తనాళాలు ఉంటాయి. అవన్నీ కూడా చిక్కుపడిపోయి ఉన్నాయి. ఇదే అతని సమస్య. ఇలా చిక్కుపడటాన్ని ఆర్టెరియోవెనస్ మాల్ఫార్మేషన్ అంటారు. ఇది చాలా తక్కువ మందిలో వస్తుంది.. అరుదైన వ్యాధి.. ప్రపంచ జనాభాలో ఒక శాతం కంటే తక్కువ మందిలోనే ఇది సంభవించే అవకాశం ఉంది. వీటివల్ల మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ చెప్పిన ప్రకారం.. అలా రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దృష్టి మసకబారుతుంది. తుమ్మినప్పుడు చిక్కుపడిపోయిన ఆ రక్తనాళాలు చిట్లిపోతాయి. దీంతో వ్యక్తులు స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తారట. మెదడులో అంతర్గతంగా రక్తస్రావం అధికంగా అవుతుంది. ఈ యువకుడి విషయంలో ఇదే జరిగింది. వారం రోజులు పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు.. నెల రోజులు ఇంట్లో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత మెల్లగా తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు.
లక్షణాలు ఇలా…
ఈ వ్యాధికి ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు.. సమస్య కాస్త తీవ్రంగా మారాక కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
స్పృహ కోల్పోవడం
వికారం, వాంతులు
తిమ్మిరి
వణుకుతున్నట్టు అనిపించడం
తల తిరగడం
తలనొప్పి
కండరాల బలహీనత
పక్షవాతం
మాట్లాడటంలో ఇబ్బంది
మానసిక గందరగోళం
చిత్తవైకల్యం
వెన్నునొప్పి రావడం