కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడు..టిడిపిలోనే రాజకీయం మొదలుపెట్టి..టిడిపి జెండా కప్పుకునే మరణించిన నేత. అలాంటి నేత కుటుంబానికి టిడిపిలో ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. నిదానంగా ఆ ఫ్యామిలీ దూరమయ్యేలా ఉంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కోడెల ఫ్యామిలీకి షాక్ ఇచ్చినట్లు అయింది. సత్తెనపల్లి ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణని పెట్టడంతో సీన్ మారిపోయింది.
అసలు కోడెల టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేత 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు నరసారావుపేటలో గెలిచారు. 2014లో సత్తెనపల్లిలో గెలిచి కొత్త ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్ గా చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈయన ఫ్యామిలీపై, ఈయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అవమాన భారంతో కోడెల ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కోడెల మరణం తర్వాత..ఆయన వారసుడు శివరాం యాక్టివ్ అయ్యారు. సత్తెనపల్లిలో పనిచేస్తున్నారు.
అదే సమయంలో అక్కడ కోడెలని వ్యతిరేకించే టిడిపి నేతలు ఉన్నారు. ఆయనకు సీటు ఇవ్వవద్దని కోరుతున్నారు. ఈయనే కాదు ఇంకా పలువురు టిడిపి నేతలు సీటు ఆశిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పోరు నడుస్తుంది. ఈ పోరుకు చెక్ పెడుతూ అక్కడ నాయకులని సైడ్ చేసి..కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు ఇచ్చారు. నెక్స్ట్ ఈయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది.
దీంతో కోడెల వారసుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తాము టిడిపినే నమ్ముకున్నామని, కానీ టిడిపి అధిష్టానం తమపై వివక్ష చూపుతుందని, కోడెల కుటుంబాన్ని పక్కన పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం బాబుతో 5 నిమిషాల మాట్లాడే సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. అయితే కోడెల తనయుడు ఆవేదన నేపథ్యంలో శివరాంకు వేరే సీటు ఇవ్వడమా? లేక అధికారంలోకి వచ్చాక ఏదైనా కీలక పదవి గాని ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. చూడాలి మరి చంద్రబాబు ఏం చేస్తారో.