కెనడా దేశంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ విమర్శల వర్షం గుప్పించారు. ఖలిస్థానీ అంశంపై ఆ దేశ వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. భారత్ భద్రతకు, సమైక్యతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటే తప్పకుండా స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
దిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. ఖలిస్థానీ అంశం రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. ఖలిస్థానీ మద్దతుదారులకు ఆశ్రయమివ్వవద్దని గత కొన్నాళ్లుగా కెనడాను భారత్ కోరుతోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకునే వరకూ పాకిస్థాన్‌తో సత్సంబంధాలకు అవకాశం లేదని జైశంకర్ స్పష్టం చేశారు. చైనాతో సంబంధాలపైనా ఆయన స్పందించారు. సరిహద్దుల్లోని పరిస్థితులే ఆయా దేశాల మధ్య సంబంధాలను సూచిస్తాయని తెలిపారు. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. మరోవైపు ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు పాక్‌తో చర్చలను అనుమతించేది లేదని జైశంకర్ స్పష్టం చేశారు.