గత మూడ్రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి, యమునా పరీవాహక ప్రాంతాల్లో నివసించే వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. ఢిల్లీ వద్ద సోమవారం సాయంత్రానికి యమునా నది 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ మహోగ్రంగా ప్రవహిస్తోంది.
యమునా నదిలో నీటి మట్టం పెరిగిన దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో వరద పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేజ్రీవాల్ లోతట్టుప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వరదనీరు అధికంగా వస్తుండటంతో యమునా నది కట్టలు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమై వరద పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నారు.