విద్యుత్ వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

-

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కరెంట్ కయ్యం తారాస్థాయికి చేరింది. ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు నిరసనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా చేపట్టే సత్యాగ్రహ దీక్షలను నీరుగార్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందని.. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుందని అన్నారు. విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టింది కేసీఆరే అని.. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు రేవంత్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు పంపిణీకి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తెలిపారు .

Read more RELATED
Recommended to you

Latest news