గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే చాలా గ్రామాలు, పల్లెలు తేరుకుంటున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా వరదల దాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే…మరోసారి తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 23 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. పశ్చిమ దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అలాగే గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది.