తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఒరగబెట్టిందేం లేదంటూ MLC కవిత విమర్శించారు. పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెల్లదీస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మాటలతో కాలయాపనా చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడికి పారిపోయినా.. తాను వెంటాడి మరీ ఓడిస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసి గెలవనున్నట్లు కవిత వెల్లడించారు.
తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ లేదని పార్లమెంటులో బండి సంజయ్ ప్రస్తావించండంపై కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యాలయం వద్ద కరెంటు తీగలు పట్టుకొని చూడమని బండికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని కవిత అన్నారు. రెండు పార్టీల మధ్య సుమారు 20 శాతం ఓట్ల తేడా ఉంటుందని కవిత తెలిపారు. తమకు ప్రశాంత్ కిషోర్ అవసరం లేదని, కేసీఆర్ చాలని అన్నారు.