టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమన్నారు జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఆయన ఎద్దేవా చేశారు. వందేళ్ళ వయసులో కూడా పాలన చేస్తానని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు అని.. తన విధానం ఏంటో, తాను వస్తే ఏం చేస్తాడో చెప్పాలని సజ్జల పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ సజ్జల ప్రశ్నించారు. పైకి పోయినా తానే శాశ్వతంగా పాలిస్తాను అనుకుంటున్నారని.. ప్రజలంటే అపహాస్యం, చులకన భావం దీనిలో వ్యక్తం అవుతుందన్నారు సజ్జల.
గత ఐదేళ్లలో ఇప్పుడు చెప్పిన అంశాల్లో ఒకటైనా చేశాడా అంటూ ప్రశ్నించారు సజ్జల. నిన్న ఏం చేశారో, ఇవాళ ఏం చేశారో.. పిచ్చి స్థాయి దాటి ఒక ట్రాన్స్‌లో ఉన్నాడని సజ్జల ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక తిక్కమేళమని.. తలా తోక లేని ఆలోచనలు చేస్తుంటాడని ఆరోపించారు. సినిమాల్లో ఇలాంటివి చూపిస్తారన్నారు. ఎన్నికలే ప్రజా కోర్టు అని.. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని ప్రశ్నించారు. సినిమాలు లేనప్పుడు యూట్యూబ్‌లో ప్రజా కోర్టు పెడతాడేమో అంటూ ఎద్దేవా చేశారు.తెలుగు, హిందీలో కూడా ఇలాంటి సీరియల్స్ వచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావటానికే అవకాశం లేదన్నారు.ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో తెలియదని.. ఇక అధికారంలోకి ఎలా వస్తాడంటూ సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వీరే అన్నారని.. ఇప్పుడు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అనటం ప్రజల్ని మభ్యపెట్టడమేనని మండిపడ్డారు సజ్జల.