ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీతో పొత్తు లాభం.. నష్టం అని లెక్కలేస్తోంది. పైకి క్లారిటీ ఇవ్వనప్పటికీ ఫలానా పార్టీతో పొత్తులుంటాయని పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలు సంకేతాలిస్తున్నాయి. ఒక్క వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ దాదాపు ఇదే పంథాలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగేదశం పార్టీ, జనసేన పార్టీలు పొత్తుల మీదే ఆధారపడ్డాయి. ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక తేలాల్సింది ఆంధ్రప్రదేశ్ లోనే. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కసితో ఉన్నారాయన.
జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని, అవసరమైతే పొత్తులు ఉంటాయని పలు సందర్భాల్లో పవన్ ప్రకటించారు. ఇప్పుడు ఇద్దరిదీ ఇదే లక్ష్యం కావడంతో పొత్తులు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏ మేరకు సీట్ల పంపకాలుంటాయనేదే తేలాల్సి ఉంది. 2014లో జగన్ ఓడించేందుకు టిడిపి బిజెపి జనసేన కలిసి పనిచేశాయి. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగా బిజెపి భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో జనసేన అధికారంలో భాగస్వామి కాలేదు కానీ, ఇప్పుడు సీట్ల తో పాటు అధికారంలోనూ భాగస్వామి కావాలని చూస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్ అయితే వపన్ కి సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. తన వారాహీ యాత్రలో ఒక్కఛాన్స్ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడం చూస్తే, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే యోచన పవన్ లో ఉందనేది స్పష్టమవుతోంది.
ఇక చంద్రబాబుకు బీజేపీతో సయోధ్య కుదురుతుందా అనేది ప్రశ్నార్ధకం. గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీపై నోరు పారేసుకుని ఆ పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ ఇప్పుడు కమలం పార్టీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారు. అయితే ఏపీలో నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తప్ప, బీజేపీని తాము వ్యతిరేకించలేదని చెబుతున్నారు. అంటే బిజెపితో పొత్తుకు సిద్ధమని ఢిల్లీ వేదిక చంద్రబాబు సంకేతాలు ఇచ్చారన్నమాట. ఏపీలో బలం లేకపోయినా, కేంద్రంలో బలం ఉండడంతో అధికార, ప్రతిపక్షాలు.. బీజేపీ సహకారాన్ని ఆశిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీతో ప్రత్యక్షంగా పొత్తులు లేకపోయినా అవసరమైన సమయంలో టీడీపీ, వైసీపీ నుంచి బీజేపీకి మద్దతు లభిస్తూనే ఉంది.
ఇక వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనుంది. వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు. అభివృద్ది, సంక్షేమం తమను వచ్చే ఎన్నికల్లో అధికారానికి చేరువ చేస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారు. ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలే తమ పార్టీకి రక్ష అంటూ చెప్పుకొస్తున్నారు. గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసిన జగన్.. ఈసారి కూడా అదే ధీమాతో ఉన్నారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని, ఏ పార్టీతోనూ కలవబోమని అంటున్నారు. అయితే బీజేపీ సహకారం తీసుకుంటుందనే ఊహాగానాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి. ఏదిఏమైనా పొత్తుల విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.