తెలంగాణ గాంధీ భవన్ వద్ద నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కి సంబంధించి పోస్టర్లు వెలిశాయి. ముఖ్యంగా ఓ బ్యాక్ నిజామాబాద్ అనే పోస్టర్లు వెలవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేయించారా..? లేక అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఈ పోస్టర్లను వేయించారా అని తర్జన భర్జన పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాను ఎల్బీనగర్ లో పోటీ చేస్తున్నానని ఎప్పుడైతే ప్రకటించానో అప్పటి నుంచే తనపై కొంత మంది వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ కు ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా గాంధీభవన్ వద్ద వెలిసిన పోస్టర్ల వెనుక ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తముందని తెలిపారు. సుధీర్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.అసలు నేను ఎందుకు నిజామాబాద్ కు వెళ్లాలి. నేను పుట్టి పెరిగింది హయత్ నగర్ లోనే అని ఆసక్తికర విషయాలు వెల్లడించారు మధు యాష్కి. మా తాత సమాధి హయత్ నగర్ లోనే ఉందని.. తాను కూడా హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని గుర్తు చేశారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. నెల రోజుల్లోనే టిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎల్బీనగర్లో పోటీ చేస్తున్నాననే సరికి సుధీర్ రెడ్డికి భయం పుట్టుకుందని.. ఎక్కడ ఓడిపోతానేమోనని భయంతో గాంధీభవన్ వద్ద పోస్టర్లు వేశారని తెలిపారు. ఇలాంటి పోస్టర్లు ఏమి చేయలేవని ఎల్బీనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.