పింక్ డైమండ్, వివేకా హత్య, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో.. స్కిల్ స్కాంలోనూ అంతే అబద్ధం ఉందని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబుకు, ఆయనకు చెందిన వారి ఖాతాల్లోకి డబ్బు వెళ్లినట్లు సీఐడీ నిరూపించలేకపోయిందని చెప్పారు. సిఐడి ‘కక్ష సాధింపు డిపార్ట్మెంట్’గా మారి చంద్రబాబుపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. టీడీపీ అధినేతకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఈ ఆరోపణలను ప్రజలు నమ్మరన్నారు.
చేయని నేరానికి తన తండ్రి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కక్షసాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో… బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో ఈ రోజు ఇది రాస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్న లోకేష్… “ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగా. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజంటూ తెలియదు. ఆయన రాజకీయాలు ఎప్పుడూ హుందాతనంగా, నిజాయతీగా ఉంటాయి” అని అన్నారు.