మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన పరకాలలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, వారి కుటుంబం తప్ప ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని, ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని ఈటల రాజేందర్ చెప్పారు. పరకాల బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్ర బాధ్యతలను వారి కుటుంబ సభ్యులకే అప్పగించారన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటు వేసినట్లేనని, అదే బీజేపీకి వేస్తే మనకు మనమే వేసుకున్నట్లు అన్నారు ఈటల రాజేందర్. సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని, కానీ ఆ రోజున మనకు స్వాతంత్ర్య వేడుకలు ఎందుకు జరపడం లేదో చెప్పాలన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ప్రజలు భావిస్తున్నారన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి ఆత్మగౌరవం నిలబెట్టిన బిడ్డ అమిత్ షా అన్నారు. నిజాంకు వారసులు కాకపోతే విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదో చెప్పాలన్నారు. కేయూ విద్యార్థులను టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కొట్టించిన నిజాం కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉండే ఇద్దరు వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు కేసీఆర్ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రిటర్న్ గిప్ట్ ఇస్తామన్నారు. పోలీసులు, ఉద్యోగులు కేసీఆర్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని, ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కేసీఆర్‌కు సహకరించరన్నారు. నిజాం సర్కారే మట్టిలో కలిసిపోగా, కేసీఆర్ సర్కార్ ఎంత? అన్నారు.