పార్లమెంట్ పాత భవనం భారత్‌ సువర్ణాధ్యాయానికి సాక్షిభూతం: ప్రధాని

-

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్​సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. 75 ఏళ్ల పార్లమెంటు భవనంపై మోదీ మాట్లాడుతున్నారు. ఈ చారిత్రక భవనం నుంచి వీడ్కోలు తీసుకుంటున్నామని.. ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైందని తెలిపారు. కొత్త భవనంలోకి వెళ్లినా ఈ భవనం నిరంతర ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ఈ భవనం భారత్‌ సువర్ణాధ్యాయానికి సాక్షిభూతమని.. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని చెప్పారు.

‘భారత అభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం మనకు కనిపిస్తుంది. భారత్‌ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 75 ఏళ్లలో మనం సాధించింది ప్రపంచాన్ని అబ్బురపరిచింది. చంద్రయాన్‌-3 భారత సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనం. భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను.’ అని మోదీ అన్నారు.

నేడు ప్రపంచానికి భారత్‌ మిత్రదేశంగా రూపొందిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలో ప్రతి దేశం భారత్‌ను మిత్రదేశంగా పరిగణిస్తోందని అన్నారు. భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైందని పునరుద్ఘాటించారు. ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయన్న ప్రధాని.. ఈ భవనంతో తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయని భావోద్వేగానికి గురయ్యారు. చర్చలు, వాదనలు ఎన్ని ఉన్నా ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news