రాష్ట్రంలో లేస్తే.. మనిషిని కాదంటూ.. అటు అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్న చంద్రబాబుకు ఊహించని విధంగా పరాభవం ఎదురైంది. రెండు నెలల కిందట గుంటూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘర్షణలు, అక్కడ నుంచి కార్యకర్తలు బయటకు రావడం వంటి పరిస్థితిని తనకు, పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపైనా, పోలీసులపైనా కూడా విరుచుకుపడ్డారు.
నిజానికి ఆత్మకూరు అనేది ఒకటి గుంటూరులో ఉందనే విషయం అప్పటి వరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా తెలియదు. ఈ రగడతో చంద్రబాబు ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యం పెంచారు. ఇక్కడ పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని, కాబట్టి తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, అందుకే ఇక్కడ నుంచి ప్రజలు పారిపోయారని అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు, దీక్షలు, నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. ఒకానొక సందర్భంలో ఆయనను గృహ నిర్భంధం చేసే పరిస్థితిని కూడా తెచ్చుకున్నారు.
అయితే, ఇది తర్వాత సర్దు మణిగింది. పోలీసులే రంగంలోకి దిగి దళిత వర్గాలకు, టీడీపీ నాయకులకు కూడా భరోసా కల్పించి పల్నాడులో ప్రశాంతతకు కృషి చేశారు. కట్ చేస్తే.. ఇదే విషయంపై చంద్రబాబు.. జాతీయ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. భారీ ఎత్తున టీడీపీ ప్రచురించిన పుస్తకాలను కూడా హక్కుల కమిషన్కు అందించారు. దీంతో ఇటీవల మూడు రోజుల పాటు ఎన్హెచ్ ఆర్సీ బృందం పెద్ద ఎత్తున గుంటూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజల నుంచి సమాచారం సేకరించింది.
దీంతో ఇంకేముంది జగన్ ప్రభుత్వానికి హక్కలు కమిషన్ నోటీసులు ఇస్తుందని, చీల్చి చెండాడుతుందని టీడీపీ నేతలు భావిం చారు. కానీ, ఇలాంటిదేమీ జరగలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని కానీ, పోలీసుల కారణంగా ఇక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయని కానీ, పోలీసులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని కానీ ఎక్కడా హక్కుల సంఘం రిపోర్టు ఇవ్వకపోగా ప్రభుత్వంపైనా ఎలాంటి కామెంట్లు చేయలేదు. నిజానికి ఈ పరిణామం టీడీపీకి పెను దెబ్బగా పరిణమించింది. మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.