చంద్రయాన్ 3 పై చైనా అక్కసు.. దక్షిణ ధ్రువంపై దిగలేదని వివాదాస్పద వ్యాఖ్యలు

-

 భారత్‌కు పొరుగు దేశాలు అయినటువంటి చైనా, పాకిస్థాన్‌లు ప్రతీ విషయంలోనూ తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాయి. ఆ దేశాలకు సాధ్యం కానీ విజయాలను భారత్ సాధించిందనే ఆగ్రహంతో నిత్యం పని కొట్టడానికి..  ఏదో ఒక అంశంపై నోరు పారేసుకుంటూనే ఉంటాయి. ప్రపంచంలోని ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారి ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత్‌పై అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతోంది. అయితే మన పొరుగున ఉన్న చైనా మాత్రం.. తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగంపై.. దాని ఫలితాలపై లేనిపోని అనుమానాలు లేవనెత్తుతూ తన వక్రబుద్ధిని చూపించుకుంటోంది. అసలు చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి వెళ్లనే లేదని.. అక్కడ దిగలేదని కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తోంది.చంద్రుడిపై చేసే పరిశోధనలకు సంబంధించి చైనాలో పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త ఒయాంజ్ జియూన్.. తాజాగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగంపై సందేహాలు లేవనెత్తారు.

చంద్రయాన్ -3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. దక్షిణ ధ్రువానికి 619 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఒయాంజ్ జియూన్ పేర్కొన్నారు. అయితే ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అయినపుడు కూడా చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా ఇదే రకమైన కథనాలను ప్రచురించింది. భారత్ కంటే చైనా వద్ద మెరుగైన టెక్నాలజీ ఉన్నట్టు చైనాకు చెందిన సీనియర్ నిపుణుడు పాంగ్ జిహావో వ్యాఖ్యలను ఆ సందర్భంగా గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది.   ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విధంగా అతి తక్కువ బడ్జెట్‌తో.. అన్ని దేశాల కంటే ముందుగా.. సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచిందని అంతర్జాతీయ సమాజం మొత్తం కోడై కూస్తున్న వేళ.. చైనా చేస్తున్న వింత వాదనలు అర్థం లేనివని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news