అనుకున్నదే జరిగింది. అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను ఇవాళ ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి. ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. గత ఎంపీసీ సమావేశం జరిగిన ఆగస్టుతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగిందని శక్తికాంత దాస్ తెలిపారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయాలపరంగా దూకుడును కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మారాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ (RBI) కీలక రేట్లను యథాతథంగానే ఉంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాల ప్రకారమే ఆర్బీఐ తాజా నిర్ణయం ఉండటం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే.. దాన్ని లక్ష్యిత పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.