తెలంగాణ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. కరెక్ట్ గా మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి..119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఆ రోజు తెలంగాణ గడ్డపై అధికారం దక్కించుకునేది ఎవరో తేలిపోనుంది. గత ఎన్నికల మాదిరిగా వన్‌సైడ్ ఫలితాలు ఈ సారి వచ్చేలా లేవు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం.
అయితే మొన్నటివరకు బిజేపి రేసులో ఉంది..కానీ ఇటీవల ఆ పార్టీ వెనుకబడింది. దాదాపు అన్నీ సర్వేలు బిజేపిది మూడో స్థానమే అని తేల్చేస్తున్నాయి. ప్రజలు కూడా బిజేపిని ఆదరించేలా లేరు. ఆ పార్టీ మూడోస్థానంకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఏదో కొన్ని స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ పార్టీని పక్కన పెడితే ప్రధాన పోరు కారు, కాంగ్రెస్ మధ్యే. గత రెండు ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న బిఆర్‌ఎస్..ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తుందని బిఆర్‌ఎస్ ధీమాగా ఉంది.
గత రెండు సార్లు ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్..ఈ సారి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలని కోరుతుంది. ఇప్పటివరకు బిఆర్‌ఎస్ పాలన చూశారు కదా..ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, ఒక్క ఛాన్స్ అంశం, ఆరు గ్యారెంటీలు తమకు అధికారం దక్కేలా చేస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది.
కానీ ఇప్పటివరకు ప్రజల్ ఎటువైపు ఉంటారో తేలడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో బిఆర్‌ఎస్ ఆధిక్యంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. దానికి పోటీగా కాంగ్రెస్ ఉంది. మొత్తానికి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారు..ఈ సారి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.