తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజైన ఇవాళ శ్రీవారికి అర్చకులు హనుమంత వాహన సేవ నిర్వహించారు. హనుమంత వాహనం తిరుమల వేంకటేశ్వరుడు భక్తులకు కనువింది చేస్తూ.. అభయ ప్రదానం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి వారి వాహన సేవలో పాల్గొని తన్మయత్వం పొందుతున్నారు. తిరుమలేశుడి నామస్మరణలతో.. గోవింద గోవింద నామాలతో తిరుమాఢ వీధులు మార్మోగుతున్నాయి.
మరోవైపు ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనసేవ, సాయంత్రం నాలుగు గంటలకు అత్యంత విశేషమైన పుష్పక విమాన సేవ జరగనున్నట్లు టీడీడీ అధికారులు తెలిపారు. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టీడీడీ అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.