లోకసభ అభ్యర్ధుల ప్రకటనపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ సోనియాగాంధీకి లేఖ రాయడం, రెండు రోజుల కిందట వీహెచ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ఏఐసీసీ సీరియస్ అయినట్టు సమాచారం. వీరిద్దరికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో మాట్లాడాలని రాష్ట్ర నాయత్వానికి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి విధేయుడుగా ఉన్న వీహెచ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ నిర్ణయాలను ఎవరైనా ఆమోదించాల్సిందేనని.. వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవైనా భిన్నాభిప్రాయాలుంటే అంతర్గత సమావేశాల్లో చెప్పాలన్నారు. దయచేసి వివాదాలు సృష్టించకూడదన్నారు.