బీఆర్ఎస్ ఉనికి ఇక కష్టమే… పీకే సంచలన వ్యాఖ్యలు

-

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలపడుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అంతకంతకూ బలహీనమవుతోంది.ముఖ్యనేతలతో పాటు కేడర్ కూడా వలస వెళుతోంది. కనీసం వాళ్ళను ఆపే ప్రయత్నం కూడా చేయడంలేదు గులాబీ పార్టీ పెద్దలు. ఓ వైపు నేతల జంపింగులు,మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మద్యం కేసులో జైల్లో ఉండటంతో మాజీ సీఎం అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది.ఎక్కడా కనీసం పొలిటికల్ కామెంట్ కూడా చేయడం లేదు.దీంతో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఉనికి కోల్పోతుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.ఇప్పుడు కేవలం రైతులను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కేసీఆర్ కి.

బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే…తాజాగా ఆ పార్టీపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తానే బీఆర్ఎస్ కార్యకర్తను అయ్యి ఉంటే.. ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితిపై కచ్చితంగా ఆందోళన చెందేవాడినని చెప్పుకొచ్చారు పీకే.అంతేకాదు ఒకవేళ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించారు.లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి కష్టమేననే స్టేట్ మెంట్ ఇచ్చారు.ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమయ్యాయి. పీకే తాజా వ్యాఖ్యలతో అటు కారు పార్టీ నేతలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.పీకే మాటల్లో వాస్తవాలు లేకపోలేదని మరికొందరు బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. కేడర్ కి భరోసా లేకపోవడం,ముఖ్యనేతలు తరలిపోవడమే అందుకు కారణమని చెప్తున్నారు.

మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పీకే చేసిన కామెంట్లు.. రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి తెలంగాణలో ఉనికి లేకుండా పోయే పరిస్థితి వస్తుందని ఆయన కామెంట్ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా.. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని పదే పదే ప్రస్తావించటం.. ఇప్పుడు పీకే కూడా అదే మాట చెప్పటంతో.. గులాబీ శ్రేణుల్లో గుబులు రేగుతోంది. అయితే ఇలాంటి కీలక సమయంలో కేసీఆర్ మౌనం వహించడాన్ని కొందరు నేతలు వ్యూహంగా చెప్పుకుంటున్నారు.రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని వేదాలు వల్లిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news