సీఎం చంద్రబాబు విజన్ 2047 పేరుతో మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే అని మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది. అయితే 1998లో కూడా చంద్రబాబు గారు విజన్-2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం.
రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబుగారు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్-2020 కాదు, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారు. 2014లోకూడా చంద్రబాబుగారు విజన్-2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది అని జగన్ స్పష్టం చేసారు.