ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టేందుకు విశాఖ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ నుంచి నిరసనలు ఎదురైన సంగతి తెలిసిందే. విశాఖకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వైసీపీ శ్రేణులు విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. మరియు చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగడంతో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అంతటితో ఆగని కొందరు చంద్రబాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు.
ఇక చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై అడ్డుగా పడుకున్నారు. దీంతో పోలీసులు చంద్రబాబును వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అయినప్పటికీ.. చంద్రబాబు తన వాహనం దిగి పాదయాత్ర తరహాలో నడిచేందుకు ప్రయత్నించగా పోలీసులు భద్రతా కారణాలను చూపి ఆయనను వారించారు. దాంతో చేసేదిలేక చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. మూడు గంటల క్రితమే ఆయన వైజాగ్ చేరుకోగా, ఇప్పటికీ రోడ్డుపైనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.