14 నుంచి కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు ఉన్న తరుణంలో ట్విట్టర్ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా” అని ఆగ్రహించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు అంటూ చురకలు అంటించారు. ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! అన్నారు.
కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్” అంటూ చురకలు అంటించారు. ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారని నిలదీశారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ? అని ఆగ్రహించారు.